న్యూఢిల్లీ: చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం)కు (Women’s Reservation Bill) లోక్‌సభ ఆమోదం తెలిపింది. సుమారు 8 గంటల చర్చ తర్వాత ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉండటంతో స్లిప్‌ల ద్వారా ఓటింగ్ చేపట్టారు. సభలో ఉన్న మొత్తం 456 సభ్యుల్లో 454 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. ఎంఐఎంకు చెందిన ఇద్దరు సభ్యులు మహిళా బిల్లును వ్యతిరేకించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లుకు సుమారు 27 ఏండ్ల తర్వాత మోక్షం లభించింది. అయితే డీలిమిటేషన్ తర్వాతే మహిళలకు రిజర్వేషన్ కోటా అమలుకానున్నది.
కాగా, ఈ నెల 19న కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు చారిత్రక రోజుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లును ఆమోదించాలని ప్రతిపక్షాలను కోరారు. బుధవారం లోక్‌సభలో ఈ బిల్లుపై సుమారు ఎనిమిది గంటలపాటు చర్చ జరిగింది. సాయంత్రం ఓటింగ్ నిర్వహించిన తర్వాత చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. కొత్త పార్లమెంట్ భవనంలో పాస్ అయిన తొలి బిల్లుగా ఇది చారిత్రకెక్కింది. 2010లో తొలిసారి రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. అనంతరం 13 ఏళ్ల తర్వాత బుధవారం లోక్‌సభలో కూడా ఆమోదించడంతో ఈ చారిత్రక బిల్లుకు మోక్షం లభించినట్లయ్యింది. దీంతో లోక్‌సభలో మహిళా సీట్ల సంఖ్య 181కు పెరుగనున్నది.
#WATCH | Lok Sabha MPs vote on Women’s Reservation Bill pic.twitter.com/ZngFNhesc5
— ANI (@ANI) September 20, 2023