బెంగుళూరు: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన HLFT-42 విమానంపై ఉన్న హనుమాన్ బొమ్మను తొలగించారు. బెంగుళూరులో జరుగుతున్న ఏరో షోలో ఆ విమానాన్ని ప్రదర్శించారు. నిజానికి తొలుత ఆ ఎయిర్‌క్రాఫ్ట్ తోకభాగంలో ఉన్న వర్టికల్ ఫిన్పై హనుమంతుడి బొమ్మను వేశారు. కానీ ఆ పిక్చర్‌ను తొలగించినట్లు ఇవాళ హెచ్ఏఎల్ ప్రకటించింది. HLFT-42 విమానాలను శిక్షణ కోసం వాడనున్నారు. ఈ విమానాలతో పైలెట్లకు సూపర్సోనిక్ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
హెచ్ఏఎల్ సంస్థ ఈ విమానాన్ని నెక్ట్స్ జనరేషన్ విమానంగా భావిస్తోంది. దీంట్లో అత్యాధుని టెక్నాలజీ వస్తువుల్ని అమర్చారు. యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఆరే (ఏఈఎస్ఏ), ఎలక్ట్రానిక్ వార్ఫేర్ (ఈడబ్ల్యూ) సూట్, ఇన్ఫ్రా రెడ్ సెర్చ్ అండ్ ట్రాక్(ఐఆర్ఎస్టీ), ఫ్లై బై వైర్ కంట్రోల్(ఎఫ్‌బీడబ్ల్యూ) సిస్టమ్స్ ఉన్నాయి.
హెచ్ఏఎల్ మారుత్ తొలి స్వదేశీ విమానం. అయితే దానికి అప్‌గ్రేడ్‌గా HLFT-42 విమానాన్ని తయారు చేశారు. మారుతికి మరో పేరు వాయువు అని, పవన్ అని కూడా పిలుస్తారని, పవన పుత్రుడే హనుమంతుడని, అందుకే ఆయన ఫోటోను ఆ విమానం ఫిన్ భాగంలో పెట్టినట్లు గ్రూపు కెప్టెన్ హెచ్వీ థాకూర్ తెలిపారు. కానీ మరుసటి రోజే HLFT-42 విమానంపై ఉన్న హనుమంతుడి ఫోటోను తీసివేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.