భోపాల్: ముస్లిం పురుషుడు, హిందూ యువతి వివాహం ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం చెల్లదని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. (Hindu-Muslim marriage) ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం కూడా మతాంతర వివాహాన్ని నమోదు చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. పోలీస్ రక్షణలో ప్రత్యేక వివాహం కోసం ఒక జంట చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ముస్లిం వ్యక్తి, హిందూ మహిళ పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే వారిద్దరూ తమ మతాన్ని వదులుకోక కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో పోలీస్ రక్షణ కల్పించడంతోపాటు ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
కాగా, ఆ జంట మతాంతర వివాహాన్ని హిందూ మహిళ కుటుంబం కోర్టులో వ్యతిరేకించింది. వారిద్దరూ పెళ్లి చేసుకుంటే సమాజంలో తమ పరువుపోతుందని వాపోయింది. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె తన వెంట నగలను కూడా తీసుకెళ్లినట్లు ఆ మహిళ కుటుంబం తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
మరోవైపు వారిద్దరూ తమ మతాలు మారలేదని, సహజీవనం కూడా చేయలేదని ఆ జంట తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం మతాంతర వివాహం చెల్లుబాటు అవుతుందని వాదించారు. ముస్లిం వ్యక్తిగత చట్టాన్ని ప్రత్యేక వివాహ చట్టం అధిగమిస్తుందని అన్నారు.
కాగా, న్యాయమూర్తి గుర్పాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని ధర్మాసనం ఇరు వర్గాల వాదనలు విన్నది. ముస్లిం పురుషుడు, హిందూ మహిళ కలిసి ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకున్నప్పటికీ ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం ఆ పెళ్లి చెల్లదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక వివాహానికి అనుమతించాలన్న ఆ జంట పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మే 27న ఈ మేరకు తీర్పు ఇచ్చింది.