పాట్నా: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అనుచిత వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో ఆదివారం సోషల్ మీడియా వేదికగా డీఎంకే, ఇతర పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. మారన్ వ్యాఖ్యలను బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఇది బీహార్, యూపీ ప్రజలను అవమానించడమేనని, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి పనిచేస్తున్న వారిని గౌరవించాలన్న కనీస మర్యాదను ఆయన మరిచారన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాల మాట్లాడుతూ డీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై ఇండియా కూటమిలోని పార్టీలు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. తమ మాతృ భాష తమిళం, ఇంగ్లీష్ చదవడం వల్ల వ్యక్తులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారనన దానికి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ లాంటి వారే ఉదాహరణ అని ఈ ఏడాది మార్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎంపీ మారన్ వ్యాఖ్యానించారు. అదే హిందీ మాత్రమే తెలిసినవారు టాయిలెట్ క్లీనర్లు, నిర్మాణ రంగ కార్మికులు నిలిచిపోతారని, దానికి యూపీ, బీహార్ నుంచి తమిళనాడు లాంటి ధనిక రాష్ర్టాలకు వచ్చి పనిచేస్తున్నవారే ఉదాహరణ అని అన్నారు.