MK Stalin | చెన్నై, ఫిబ్రవరి 27: తమ రాష్ట్రంపై హిందీని బలవంతంగా రుద్దడాన్ని సహించబోమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళ భాషను, తమిళ సంస్కృతిని పరిరక్షిస్తానని ఆయన పునరుద్ఘాటించారు. హిందీ విధింపును వ్యతిరేకిస్తామని, హిందీ అనేది ముసుగు మాత్రమేని, సంస్కృతం దాని వెనుక దాగిన ముఖమని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాసిన లేఖలో ఆరోపించారు.
1965లో డీఎంకే నిర్వహించిన హిందీ వ్యతిరేక ఉద్యమం తరహాలో మరో భాషా యుద్ధానికి సిద్ధమని స్టాలిన్ ఇప్పటికే ప్రకటించారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో మాట్లాడే మైథిలి, బ్రజ్భాష, బుందేల్ఖండీ, అవధి వంటి అనేక ఉత్తర భారతీయ భాషలను హిందీ నాశనం చేసిందని స్టాలిన్ తన లేఖలో తెలిపారు. భాషల దురాక్రమణ కారణంగా 25కి పైగా ఉత్తర భారతీయ ప్రాంతీయ భాషలు నాశనమయ్యాయని తెలిపారు.