Hindenburg | న్యూఢిల్లీ, ఆగస్టు 12: తమ ఆరోపణలు ఖండిస్తూ సెబీ చైర్పర్సన్ మాధవి పురీ బచ్, ఆమె భర్త ధావన్ చేసిన సంయుక్త ప్రకటన పలు కొత్త సంక్లిష్ట ప్రశ్నలు లేవనెత్తుతున్నదని అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ పేర్కొన్నది. మాధవి బచ్ స్పందన ద్వారా అనామక బెర్ముడా/మారిషస్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఉన్నాయన్న విషయాన్ని బహిరంగంగా ధ్రువీకరిస్తున్నారని పేర్కొన్నది. హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమని, సెబీ విశ్వసనీయతను దెబ్బతీయడంతోపాటు వ్యక్తిత్వ హననానికి ప్రయత్నిస్తున్నట్టు ఉన్నాయని సెబీ చీఫ్ మాధవి బచ్ ఆదివారం ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల తర్వాతనే హిండెన్‌బర్గ్ ఎక్స్‌లో వరుసగా పలు పోస్టులు పెట్టింది. వారి స్పందనలో పలు ముఖ్యమైన అంగీకారాలు ఉండటంతోపాటు కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని పేర్కొన్నది. బెర్ముడా/మారిషస్ ఫండ్స్‌లో పెట్టుబడులను తన భర్త చిన్ననాటి స్నేహితుడు నడుపుతున్నాడని ఆమె ధ్రువీకరించారని, ఆయన ఆ సమయంలో అదానీ గ్రూపు లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారని వెల్లడించింది. భారత్‌తో పాటు సింగపూర్‌లోని ఆమె కన్సల్టింగ్ సంస్థలు డీల్ చేస్తున్న క్లయింట్ల వివరాలను స్పష్టంగా వెల్లడించాలని హిండెన్‌బర్గ్ పేర్కొన్నది. 2024, మార్చి 31 నాటికి తాజా షేర్ హోల్డింగ్ లిస్టు ప్రకారం 2017లో తాను సెబీ సభ్యురాలిగా అయిన తర్వాత తన భర్త 2019లో టేకోవర్ చేసిన అగోరా అడ్వైజరీ లిమిటెడ్(ఇండియా)లో 99% మాధవి బచ్ పేరుపైనే ఉన్నాయని, ప్రస్తుతం ఈ సంస్థ యాక్టివ్గానే ఉన్నదని, లక్షల రూపాయల మేర కన్సల్టింగ్ ఆదాయం పొందుతున్నదని హిండెన్‌బర్గ్ తెలిపింది. అగోరా పార్ట్నర్స్ సింగపూర్‌లో 2022, మార్చి 16 వరకు 100% షేర్ హోల్డర్‌గా ఆమె ఉన్నారని పేర్కొన్నది. సెబీ చైర్‌పర్సన్‌గా నియమితులైన రెండు వారాల తర్వాతనే తన షేర్లను భర్త పేరుపై బదిలీ చేశారని వెల్లడించింది. సెబీ చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు మాధవి బచ్ తన భర్త పేరుపై ఏ ఇతర వ్యాపారాల్లో ఉన్నారనే ప్రశ్నలు వస్తున్నాయని హిండెన్‌బర్గ్ పేర్కొన్నది.
సెబీ చీఫ్‌పై ఆరోపణలు తీవ్రమైన అంశమని, జేపీసీ దర్యాప్తునకు కేంద్రం అంగీకరించకుంటే దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హెచ్చరించారు. అదానీ గ్రూపునకు ప్రధాని మోదీ సహకరిస్తున్నారని ఆరోపించారు. మోదీ సర్కార్ చెప్పే ‘అమృత్కాల్’లో ఏ సంస్థ కూడా పవిత్రంగా లేకుండా పోయిందని జైరాం రమేశ్ విమర్శించారు. అదానీ గ్రూపు ఆర్థిక అవకతవలపై దర్యాప్తు విషయంలో సెబీ రాజీపడినట్టు కనిపిస్తున్న క్రమంలో దర్యాప్తును సీబీఐ లేదా సిట్‌కు అప్పగించాలన్నారు. సెబీ సమగ్రతను పునరుద్ధరించేందుకు చైర్పర్సన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
జేపీసీ వేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తిరస్కరించారు. భారత ఆర్థిక వ్యవస్థ బలహీనపడాలని, స్టాక్ మార్కెట్ పడిపోవాలని కాంగ్రెస్ కోరుకుంటున్నదని ఆరోపించారు. పెద్ద కుట్రలోనే భాగంగా హిండెన్‌బర్గ్ ఆరోపణలు, విపక్షాలు విమర్శలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, మోదీ సర్కార్‌ను అస్థిరపరిచే ప్రయత్నాల వెనుక హిండెన్‌బర్గ్‌లో ఇన్వెస్టర్‌గా ఉన్న బిలియనీర్ జార్జి సోరోస్ ఉన్నారని ఆరోపించారు.