గౌహతి: అస్సాం ముఖ్యమంత్రిగా ఇవాళ హిమంత బిశ్వ శర్మ( Himanta Biswa Sarma) ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టడం వరుసగా ఇది రెండోసారి. ఆ రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అస్సాంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరుసగా ఇది మూడోసారి. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బీజేపీ నేత రామేశ్వర్ తేలి మంత్రిగా ప్రమాణం చేశారు. బీజేపీ కూటమికి చెందిన ఏజీపీ పార్టీ నేత అతుల్ బోరా, బీపీఎఫ్కు చెందిన చరణ్ బోరాలు కూడా ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్డీఏ బృందానికి 102 సీట్లు వచ్చాయి. అస్సాం అసెంబ్లీలో 126 మంది సభ్యులు ఉండగా, దాంట్లో బీజేపీ 82 స్థానాలను చేజిక్కించుకున్నది. ఏజీపీ, బీపీఎఫ్ పార్టీలు చెరి పది సీట్లు గెలుచుకున్నాయి.