షిమ్లా: ప్రకృతి వైపరీత్యాలు, ఆకస్మిక వరదలతో వార్తల్లో నిలిచే హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh).. దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన (Fully Literate State) నాలుగో రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 99.3 శాతానికి చేరుకుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇది జాతీయ సగటు (95 శాతం) కంటే అధికమని వెల్లడించింది. దీంతో మిజోరం, గోవా, త్రిపుర, లడఖ్ (కేంద్ర పాలిత ప్రాంతం) సరసన నిలిచింది. పూర్తిస్థాయిలో అక్షరాస్యత సాధించిన తొలి కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్‌ను 2024, జూన్ 24న ప్రకటించారు. ఈ ఏడాది మే- జూన్ మధ్య కాలంలో మిజోరం (98.2 శాతం), గోవా (99.5 శాతం), త్రిపుర (95.6 శాతం) రాష్ట్రాలు పూర్తి అక్షరాస్యత సాధించినట్లు గుర్తించారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ కూడా సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాల జాబితాలో చేరింది.
7 శాతం అక్షరాస్యత రేటు నుంచి సంపూర్ణ అక్షరాస్యతకు చేరుకోవడంలో అనేక సవాళ్లు ఉన్నాయని, అయినప్పటికీ నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు తెలిపారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తామన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లుగా మారుస్తామని చెప్పారు. కాగా, ఒక రాష్ట్రంలో 95 శాతం లేదా అంతకంటే ఎక్కువ జనాభా అక్షరాస్యులుగా మారినప్పుడు, దానిని సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా ప్రకటిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం కేరళ (94.0 శాతం).