బెంగళూరు : కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతున్నది. హైకోర్టు ప్రత్యేక బెంచ్ వివాదంపై విచారణ జరుపుతున్నప్పటికీ విద్యార్థులు హిజాబ్ ధరించి వచ్చి.. కళాశాలల వద్ద అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ క్రమంలో తమకూరులో నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు రోజులుగా ఆదేశాలను ఉల్లంఘించినందుకు తమకూరు ఎంప్రెస్ కళాశాల ప్రిన్సిపాల్ స్థానిక సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 15-20 మంది విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. హిజాబ్ ధరించి తరగతులకు హారజయ్యే విధంగా తమకు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు.
అయితే, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం ప్రిన్సిపాల్ పేర్లను ప్రస్తావించలేదు. హిజాబ్ వ్యవహారంలో నిరసన తెలిపినందుకు నమోదైన తొలి కేసు ఇదే. ఇకపై విద్యార్థుల పట్ల మెతక వైఖరి ఉండబోదని, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి జ్ఞానేంద ఇంతకు ముందే ఆదేశాలరు. ఇదిలా ఉండగా.. విజయపుర జిల్లాలో ఇండి కాలేజీ ప్రిన్సిపాల్ కాషాయ కండువా ధరించిన విద్యార్థిని వెనక్కి పంపారు. కళాశాల గేటు వద్ద అడ్డుకోగా.. విద్యార్థి బంధువులు అక్కడికి చేరుకొని బంధువులు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత పోలీసుల జోక్యంతో విద్యార్థినిని తరగతి గదిలోకి అనుమతించారు.
అయితే, శ్రీరామ్‌సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కూర్గ్ జిల్లాలోని జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ హిజాబ్ ధరించిన విద్యార్థులను కాలేజీ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని అరుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కలబురిగిలో కాంగ్రెస్ నేత ముఖరం ఖాన్ వ్యాఖ్యలపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హిజాబ్ విషయంలో ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ముక్కలు ముక్కలుగా నరికి వేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందూ సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పాటు, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.