Road Accident | రాజస్థాన్ జోధ్‌పూర్-జైసల్మేర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామ్‌దేవ్రాకు భక్తులతో వెళ్తున్న టెంపోను బాలేసర్ పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మహిళలు, పిల్లలు సహా 14 మంది తీవ్ర గాయాలకు గురయ్యారు. గాయపడిన వారందరినీ జోధ్‌పూర్‌లోని ఎండీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు, క్షతగాత్రులను గుజరాత్‌లోని సబర్కాంత జిల్లా వాసులు. జాతీయ రహదారి 125లోని ఖరీబేరి గ్రామం సమీపంలో ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మిల్లెట్ లోడ్‌తో వెళ్తున్న టక్రు వేగంగా వెళ్తూ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న టెంపోను ఢీకొట్టిందని బాలేసర్ పోలీస్‌స్టేషన్ ఇన్చార్జి మూల్ సింగ్ భాటి తెలిపారు.
వాహనం వేగంగా ఉండడంతో ట్రక్కు ముందు భాగం ధ్వంసమైందని.. ట్రక్కు బోల్తాపడిందని పేర్కొన్నారు. గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాకు చెందిన వారంతా రామదేవ్రాను సందర్శించేందుకు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలోనే ముగ్గురు భక్తులు చనిపోయారని.. జోధ్‌పూర్ ఆసుపత్రిలో ముగ్గురు చనిపోయారని తెలిపారు. ప్రమాదం తర్వాత పలువురు వాహనదారులు వేగంగా స్పందించి క్షతగాత్రులకు సహాయం అందించారని.. అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారన్నారు. బాలేసర్, అగోలై, హైవే సర్వీస్ నుంచి మూడు అంబులెన్స్‌లు వచ్చాయని.. క్షతగాత్రులను బాలేసర్ సీహెచ్‌సీకి తరలించారన్నారు. ప్రథమ చికిత్స అనంతరం అందరనీ జోధ్‌పూర్‌కు తరలించారన్నారు. మృతదేహాలను బాలేసర్ సీహెచ్‌సీ మార్చులో ఉంచామని.. ట్రక్కు డ్రైవర్ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.