Bihar Elections : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌కు ఓటర్లు పోటెత్తారు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంతో, తొలి విడతలో రికార్డు స్థాయిలో 64.66 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా రాష్ట్రంలోని 243 స్థానాలకుగానూ 121 స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. జనం భారీగా తరలివచ్చి ఓటేయడంతో ఏ పార్టీకి లాభించనుందో తెలియాల్సి ఉంది. అయితే.. అన్ని పార్టీల నేతలు ఓటర్లు తమకే మద్దుతు పలికారనే నమ్మకంతో ఉన్నారు.
డిప్యూటీ కలెక్టర్‌పై దాడి మినహా తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఈసీ చెప్పారు. అయితే.. తమ పార్టీ మద్దతుదారులున్న స్ట్రాంగ్ బూత్‌ల వద్ద తరచూ విద్యుత్ కోత ఏర్పడిందని మహాగఠ్ భందన్ నేతలు ఫిర్యాదు చేశారు. తొలి విడత ఎన్నికల్లో పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో మహాఘఠ్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (రఘోపూర్), లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, జనశక్తి జనతాదళ్ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ (మహువా), ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి (తారాపూర్) ఉన్నారు. రెండో విడత ఎన్నికలు నవంబర్ 11న జరుగునున్నాయి.
Bihar Elections 2025 Phase-I: Historic 64.66% Voter Turnout
✅ ECI’s new initiatives make voting a most pleasant experience for voters
Read more: https://t.co/KCj7grC8ql pic.twitter.com/DFuZWD4i9E
— Election Commission of India (@ECISVEEP) November 6, 2025
రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడతలో భాగంగా 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాల్లో ఇవాళ (గురువారం) పోలింగ్ జరిగింది. ఈ నెల 11న మిగతా 122 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది. అనంతరం.. ఈ నెల 14న ఫలితాలను వెల్లడించనున్నారు. తొలి విడతలో ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ 57 స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ 48 చోట్ల, ఎల్జేపీ 14, ఆర్ఎల్ఎం 2 స్థానాల్లో బరిలో నిలిచింది. మహాగఠ్ బంధన్ కూటమి నుంచి ఆర్జేడీ 73 చోట్ల, కాంగ్రెస్ నుంచి 24 మంది, సీపీఐ-ఎంఎల్ తరపున 14 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ 119 మంది పోటీలో ఉన్నారు.