శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌కు గతంలో ఇచ్చిన ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని కోరుతూ శాసన సభ బుధవారం చేసిన తీర్మానంపై బీజేపీ ఎమ్మెల్యేలు వరుసగా రెండో రోజు గురువారం సభలో తీవ్ర నిరసన తెలిపారు. మరోవైపు, ప్రతిపక్ష పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానంలో అధికరణలు 370, 35ఏలను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే, శాసన సభలో ప్రతిపక్ష నేత సునీల్ శర్మ సభలో మాట్లాడుతున్న సమయం లో అవా మీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే షేక్ ఖుర్షీద్ వెల్‌లోకి ప్రవేశించి, అధికరణలు 370, 35ఏలను తక్షణమే పునరుద్ధరించాలని బ్యానర్‌ను ప్రదర్శించారు.
బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి ప్రవేశించి, ఆ బ్యానర్‌ను చింపేశారు. దీంతో ఖుర్షీద్, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య స్వల్ప ఘర్షణ, తోపులాట జరిగింది.ఈ సందర్భంగా మార్షల్స్, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.