Fire broke | ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. అలీగఢ్ బైపాస్‌లో హైటెన్షన్ విద్యుత్ లైన్ తెగి బస్సుపై పడటంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి. బస్సు కిటికీల నుంచి దూకి పలువురు ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకున్నారు. మంటల నుంచి రక్షించుకునేందుకు జరిగిన తొక్కిసలాటలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 12 మంది ప్రయాణికులు గాయపడగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. బస్సులో ప్రయాణిస్తున్న వీరంతా ఇటుకల తయారీ కార్మికులే.
అలీగఢ్ దాదాస్లోని అలంపూర్ బైపాస్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం తప్పింది. కాస్గంజ్ రోడ్డులో కూలీలతో వెళ్తున్న బస్సుపై హైటెన్షన్ విద్యుత్ లైన్ తెగి పడింది. వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి. బస్సులోని ప్రయాణికులను రక్షించేందుకు సమీప గ్రామస్థులు సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. క్షతగాత్రులు సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీసులు తెలిపారు.
బస్సులో 70 మంది ఇటుక బట్టీ కార్మికులు మహోబా నుంచి అలీగఢ్ వైపు వెళ్తున్నారు. వీరందరినీ ఠాణా పాలిలోని ఖుర్దియా గ్రామంలోని ఓ ఇటుక బట్టీలో పని చేసేందుకు తీసుకెళ్తున్నట్లుగా తెలుస్తున్నది. ప్రమాదం జరిగిన బైపాస్ సమీపంలోని విద్యుత్ హైటెన్షన్ లైన్లు చాలా వరకు పాతవని, శిథిలావస్థకు చేరుకోవడంతో తీవ్రంగా భయపడుతున్నామని ఆ ప్రాంత ప్రజలు తెలిపారు.