Quadruplets : మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం షియోపూర్ జిల్లా (Sheopur District) లో ఒక మహిళ మొదటి ప్రసవంలోనే ఒకే కాన్పులో నలుగురు శిశువుల (Quadruplets) కు జన్మనిచ్చింది. ఒకరి తర్వాత ఒకరు ఒక గంట వ్యవధిలో నలుగురు బిడ్డలు జన్మించారు. వారిలో ఇద్దరు మగబిడ్డలు కాగా.. మరో ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. షియోపూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (District hospital) లో ఈ కాన్పు జరిగింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
షియోపూర్ జిల్లాలోని వీర్పూర్ తాలూకా బేరుపుర గ్రామానికి చెందిన పూజ, హుకుమ్ సుమన్ దంపతులకు ఈ నలుగురు పిల్లలు జన్మించారు. అయితే కాన్పుకు ముందు ఆ దంపతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే పూజ గర్భం దాల్చి సరిగ్గా ఏడు నెలలు కూడా కాలేదు. నెలలు నిండకముందే పురిటి నొప్పులు రావడంతో వారు ఆందోళన చెందారు. నెలలు నిండకముందే జన్మిస్తే బిడ్డలు బతుకుతారో లేదోనని భయపడ్డారు.
కానీ అలాంటిదేమీ జరగలేదు. నలుగురు బిడ్డలూ క్షేమంగా ఉన్నారు. అందరూ ఒక్కో కిలో చొప్పున బరువున్నారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు సివిల్ స ర్జన్ డాక్టర్ ఆర్బీ గోయల్ తెలిపారు. పూజా సుమన్‌కు ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున ప్రసవం చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్యబృందం ఆ శిశువులను నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు. సాధారణంగా ఇంతమంది పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు సిజేరియన్ చేస్తారని, కానీ పూజ నార్మల్ డెలివరీ అయ్యిందని వైద్యులు తెలిపారు.
పిల్లలు ఒక్కొక్కరు సుమారు కిలో బరువు మాత్రమే ఉన్నారని, ఇది సాధారణ బరువు కంటే చాలా తక్కువ అని షియోపూర్ జిల్లా ఆస్పత్రి వైద్యులు చెప్పారు. అందుకే వారిని స్పెషల్ కేర్ తీసుకుని చూస్తున్నామని తెలిపారు. కాగా తనకు ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించడంపై ఆ పిల్లల తండ్రి హుకుమ్ సుమన్ స్పందించారు. ఇది తమకు దేవుడిచ్చిన వరమని ఆనందం వ్యక్తంచేశారు.