అహ్మదాబాద్, నవంబర్ 16: గుజరాత్లోని మోర్బీ బ్రిడ్జి ఘటనపై రాష్ట్ర హైకోర్టు సుమోటో విచారణను బుధవారం కొనసాగించింది. ఈ సందర్భంగా ఘటనపై అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలన్న ఆదేశాలను పట్టించుకోని మోర్బీ మున్సిపాలిటీ యంత్రాంగంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయంత్రంలోగా వివరణ ఇస్తారా? లేక రూ.లక్ష జరిమానా కడుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మున్సిపాలిటీ తరపున న్యాయవాది దేవాంగ్ వ్యాస్ అఫిడవిట్ సమర్పించారు.
ఈ సందర్భంగా అఫిడవిట్లోని పలు కీలక అంశాలను హైకోర్టు ప్రస్తావిస్తూ మోర్బీ మున్సిపాలిటీ యంత్రాంగానికి సూటి ప్రశ్నలు సంధించింది. అఫిడవిట్ ప్రకారం వంతెన పరిస్థితి బాగోలేదని 2021, డిసెంబర్ 29న అజంతా మ్యానుఫాక్చరింగ్ ప్రైవేట్ లిమిడెట్(ఓరెవా గ్రూపు) అప్పటి మున్సిపాలిటీ ప్రధానాధికారికి చెప్పినప్పటికీ, ఆ రోజు నుంచి రిపేర్ కోసం మూసివేసిన రోజు( 2022, మార్చి 7) వరకు వంతెనపైకి ప్రజలను ఎలా అనుమతించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అశుతోష్ శాస్త్రిలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
ఈ వ్యవధిలో ఆమోదం లేనప్పటికీ బ్రిడ్జి నిర్వహణకు ఓరెవా కంపెనీని ఎలా అనుమతించారో సమాధానం ఇవ్వాలని కోరింది. తదుపరి విచారణకు ప్రస్తుత మోర్బీ మున్సిపాలిటీ ఇన్చార్జి కోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించింది. ముందస్తు అనుమతి లేకుండా అక్టోబర్ 26న వంతెనను ఓరెవా కంపెనీ పునఃప్రారంభించిందని అఫిడవిట్లో పేర్కొన్న అంశాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. వంతెన నిర్వహణకు ఓరెవా కంపెనీ 2008లో తొమ్మిదేండ్ల ఒప్పందం చేసుకొన్నది. 2017, ఆగస్టు 15న ఈ ఒప్పందం ముగిసిందని, తర్వాత కూడా కొత్త ఒప్పందమేమీ లేకుండానే బ్రిడ్జి కార్యకలాపాలను ఓరెవా కొనసాగించింది.