జబల్పూర్, మే 14: కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు బుధవారం ఆదేశించింది. అసభ్యకరమైన, దిగజారుడు భాషను ఉపయోగించినందుకు మంత్రిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దేశంలో ఇంకా నిజాయితీ, క్రమశిక్షణ, త్యాగం, నిస్వార్థం, వ్యక్తిత్వం, అసమాన ధైర్య పరాక్రమాలు ఉన్న చివరి వ్యవస్థగా సాయుధ దళాలను హైకోర్టు అభివర్ణించింది.
పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారతీయ సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వివరాలను రక్షణ కార్యదర్శి విక్రం మిస్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌తో కలసి కర్నల్ సోఫియా ఖురేషీ విలేకరుల సమావేశాలు నిర్వహించారు. ఉగ్రవాదుల సోదరిగా సోఫియా ఖురేషీని వర్ణించేందుకు ప్రయత్నిస్తూ బీజేపీకి చెందిన గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్ షా ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.
బుధవారం సాయంత్రం 6 గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా పోలీసు శాఖను కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను గురువారం ఉదయం 10.30కి కోర్టు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి విజయ్ షాను ఎందుకు బర్తరఫ్ చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్ల ఇన్చార్జి) జైరాం రమేశ్ ప్రశ్నించారు. మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది.