న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గౌరంగ్ కాంత్ ఇంట్లోంచి ఆయన పెంపుడు కుక్క తప్పిపోయింది. దాంతో జడ్జి గౌరంగ్ కాంత్ ఆయన నివాసం దగ్గర ఉండే సెక్యూరిటీ సిబ్బందిపై చిందులు వేశారు. కుక్క ఇంట్లోంచి వెళ్లిపోతుంటే ఏం చేశారని మండిపడ్డారు. ఇంటి గేట్లు మూసిఉంచాలని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వినిపించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తన అధికారిక నివాసం దగ్గర ప్రభుత్వం నియమించిన భద్రతాసిబ్బంది నిర్లక్ష్యంవల్లే తన పెంపుడు కుక్క తప్పిపోయిందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన భద్రతాసిబ్బందిని సస్పెండ్ చేయాలని జడ్జి గౌరంగ్ కాంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఆయన లేఖ రాశారు. ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దాంతో, చిన్న విషయానికి పెద్దగా రియాక్ట్ అయినట్లు గ్రహించిన జస్టిస్ గౌరంగ్ కాంత్ వెంటనే మాట మార్చారు. పెంపుడు కుక్క తప్పిపోయిందన్న బాధలో ఉద్వేగంతో పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశానని, వాస్తవానికి ఈ విషయంలో భద్రతాసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తాను కోరుకోవడం లేదని ఆయన చెప్పారు. కాగా, జడ్జి ఇంటి నుంచి తప్పిపోయిన కుక్క జాడ ఇంకా తెలియరాలేదు. ఇదిలావుంటే జడ్జి గౌరంగ్ కాంత్ ప్రస్తుతం కోల్‌కతా హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు.