కోల్‌కతా: సంచలనం రేపిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ (RG Kar Case) ప్రభుత్వ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుపై కోల్‌కతా హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. బాధితురాలిపై జరిగిన దారుణం అత్యాచారమా లేక సామూహిక అత్యాచారమా అన్నది స్పష్టత ఇవ్వాలని కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐని కోరింది. అలాగే తదుపరి విచారణ నాటికి కేస్ డైరీని కూడా సమర్పించాలని ఆదేశించింది. సోమవారం కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి తీర్థంకర్ ఘోష్ ఈ కేసుపై విచారణ జరిపారు. ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి సంబంధించి నిందితుడు సంజయ్ రాయ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఈ నేపథ్యంలో ఈ నేరంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రమేయం ఉన్నదా అనే విషయాన్ని కేంద్ర ఏజెన్సీ స్పష్టం చేయాలని న్యాయమూర్తి కోరారు. ‘ఇది ‘రేప్’ లేదా ‘గ్యాంగ్ రేప్’ కేసా అన్నది కోర్టుకు సీబీఐ స్పష్టం చేయాలి’ అని జస్టిస్ ఘోష్ అన్నారు. తదుపరి విచారణ తేదీలోగా కేసు డైరీని కోర్టుకు సమర్పించాలని సీబీఐని ఆదేశించారు. అయితే ఈ కేసుపై తమ దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదని సీబీఐ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.