కుల్గాం: జమ్ము కశ్మీర్ కుల్గాం జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకరమైన ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. శుక్రవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు వీర మరణం పొందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు ఆర్మీ అధికార వర్గాలు తాజాగా వెల్లడించాయి. అఖల్ దట్టమైన అటవీ ప్రాంతంలో మొదలైన ఎదురుకాల్పులు శనివారం 9వ రోజుకు చేరాయి. అత్యంత ధైర్య సాహసాలు చూపిన లెఫ్టినెంట్ కల్నల్ ప్రీత్‌పాల్ సింగ్, సిపాయి హర్మీందర్ సింగ్‌లు ఈ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారని, తమ ప్రాణాలను త్యాగం చేసిన ఈ వీరుల సేవలను దేశం ఎన్నటికీ మరిచిపోదని ‘చినార్ కార్ప్స్’ ఒక ప్రకటనలో తెలిపింది. జవాన్ల మృతి పట్ల భారత సైన్యం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.