డెహ్రాడూన్ : విపరీతమైన మంచువర్షం కారణంగా ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో హేమకుండ్ సాహిబ్ యాత్రని నిలిపివేశారు. భారీ మంచు నేపథ్యంలో భద్రతా దృష్ట్యా యాత్రను నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘంగారియాలో దాదాపు 250 మంది భక్తులను నిలిపివేశారు. ఈ సీజన్లో తొలిసారిగా హిమపాతం శుక్రవారం రాత్రి గంగోత్రి, యమునోత్రి ధామ్ కొండ ప్రాంతాల్లో కురిసింది. అదే సమయంలో వర్షం సైతం కొనసాగుతున్నది. కేదార్నాథ్, హేమకుండ్ సాహిబ్, బద్రీనాథ్ ఆలయ పరిసరాలోని కొండ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హిమపాతం కురిసింది.
హేమకుండ్‌లో దాదాపు రెండున్నర అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. వర్షం, హిమపాతం కారణంగా గంగోత్రి ధామ్ ఉష్ణోగ్రత పడిపోయింది. హేమకుండ్ సాహిబ్ ఆలయ ద్వారాలను ఈ నెల 10న శీతాకాలం సందర్భంగా మూసివేయనున్నారు. ఈ మేరకు హేమకుండ్ సాహిబ్ మేనేజ్మెంట్ ట్రస్ట్ సన్నాహాలు ప్రారంభించింది. శనివారం ఉదయం ధామ్‌లో హిమపాతం ప్రారంభం కాగా.. సప్త శృంగ పర్వతం పూర్తిగా మంచు కప్పివేసింది. గురుద్వారా మేనేజర్ సేవా సింగ్ మాట్లాడుతూ.. శీతాకాలం సందర్భంగా ఆలయాన్ని మూసివేయనుండగా.. ఈ సమయంలో ప్రార్థనలు చేసేందుకు సిక్కు భక్తులు భారీగా ఘంగారియా చేరుకున్నారని తెలిపారు.