రాంచి, నవంబర్ 23: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి ఘన విజయం సాధించింది. హేమంత్ సొరేన్‌కు జార్ఖండ్ జనం మళ్లీ పట్టం కట్టారు. అరెస్టుతో కలిసొచ్చిన సానుభూతి, ఆదివాసీల అండ, అమలు చేసిన పథకాలు జేఎంఎం కూటమికి ఓట్లు కురిపించాయి. ఎన్డీఏ కూటమిదే అధికారం అని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ పటాపంచలయ్యాయి. 56 స్థానాలతో జేఎంఎం కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చింది. జార్ఖండ్‌లో గెలుపు కోసం బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కేవలం 24 స్థానాలతో మరోసారి ప్రతిపక్షానికి పరిమితమైంది.
జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా జేఎంఎం కూటమి 56 స్థానాల్లో విజయం సాధించింది. 43 నియోజకవర్గాల్లో పోటీ చేసిన జేఎంఎం ఏకంగా 34 స్థానాలను గెలుచుకుంది. 30 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 16 సీట్లలో విజయం సాధించింది. కూటమిలో భాగంగా ఆరు స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ నాలుగింటిలో, నాలుగు స్థానాల్లో బరిలో నిలిచిన సీపీఐ(ఎంఎల్)(ఎల్) రెండు స్థానాలను దక్కించుకున్నాయి. గత ఐదేండ్లలో జేఎంఎం ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఓట్లు కురిపించాయి. ఎన్నికలకు ఏడాది ముందు హేమంత్ సొరేన్‌ను అరెస్టు చేయడం ఆయన పట్ల సానుభూతిని పెంచింది. ముఖ్యంగా ఆదివాసీ ఓటర్లు హేమంత్‌కు ఏకపక్షంగా అండగా నిలిచారు. అందుకే రాష్ట్రంలో 28 ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉంటే జేఎంఎం కూటమి ఏకంగా 27 స్థానాలను కైవసం చేసుకుంది. జేఎంఎంకు సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన గిరిజనులు, ముస్లింలు, క్రైస్తవులకు తోడుగా నెలకు రూ.2,500 ఇస్తామనే హామీకి ఆకర్షితులైన మహిళలు ఈ భారీ విజయాన్ని కట్టబెట్టారు.
జార్ఖండ్‌లో అధికారం ఖాయమనుకున్న బీజేపీకి పరాభవం ఎదురైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కేవలం 24 స్థానాలకే పరిమితమైంది. 68 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 21 స్థానాల్లోనే విజయం సాధించింది. 10 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఏజేఎస్‌యూ పార్టీ ఒక స్థానాన్ని, రెండు స్థానాల్లో పోటీ చేసిన జేడీయూ ఒక స్థానాన్ని గెలుచుకోగా, పోటీ చేసిన ఒక స్థానాన్ని ఎల్జేపీ(రామ్ విలాస్) కైవసం చేసుకుంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా, అస్సాం సీఎం ఎన్నికల బాధ్యత తీసుకొని పని చేసినా బీజేపీకి చేదు ఫలితాలే మిగిలాయి. ఆ పార్టీ ప్రధానంగా ప్రచారం చేసిన బంగ్లాదేశ్ చొరబాటుదారుల అంశాన్ని గ్రామీణ జనం పట్టించుకోలేదు. సీఎం హేమంత్ సొరేన్పై చేసిన అవినీతి ఆరోపణలు వికటించాయి. జేఎంఎం నుంచి వలసొచ్చిన నేతలకు పెద్దపీట వేయడం, హేమంత్ సొరేన్తో సరితూగే ఆదివాసీ నేతలను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపలేకపోవడం బీజేపీని పరాజయం వైపు నడిపించాయి.
జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి విజయంలో ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, ఆయన భార్య కల్పన సొరేన్ ప్రధాన పాత్ర పోషించారు. వీరి మ్యాజిక్కు జార్ఖండ్ జనం ఫిదా అయ్యారు. హేమంత్ అరెస్టయినప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కల్పన ఏడాదిలోనే పార్టీలో కొత్త, జనాకర్షక నాయకురాలిగా అవతరించారు. దాదాపు ఆమె 200 ర్యాలీలకు హాజరయ్యారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆమె ఆకర్షించగలిగారు.
49 ఏండ్ల జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. తండ్రి శిబు సొరెన్ వారసత్వం కలిసొచ్చినా ఆయన రాజకీయ ప్రయాణం మాత్రం ముళ్లబాటగానే సాగింది. పార్టీలో అంతర్గత పోరాటాలు, కేసులు, అరెస్టు వంటి ప్రతికూలతలను ఎదుర్కొని ఆయన జార్ఖండ్‌లో తిరుగులేని నేతగా ఎదిగారు. అన్న దుర్గా అకాల మరణంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన హేమంత్ 2009లో రాజ్యసభ ఎంపీ అయ్యారు. 2010లో బీజేపీ సర్కార్‌లో డిప్యూటీ సీఎం పదవి అందుకున్నారు. 2013లో కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో 38 ఏండ్ల వయసులోనే తొలిసారి సీఎం అయ్యారు. అయితే, 2014లో అనూహ్యంగా అధికారం చేజారిపోయింది. 2019 ఎన్నికల్లో గెలిచి రెండోసారి సీఎం అయ్యారు. జనవరి 31న ఆయనను ఈడీ అరెస్టు చేసింది. అరెస్టుకు ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఐదు నెలల జైలు జీవితం తర్వాత విడుదలై మరోసారి సీఎం పదవిని అందుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి సీఎం కాబోతున్నారు.