న్యూఢిల్లీ, మే 17: ఓ మహిళా రోగిని అత్యవసరంగా దవాఖానకు తరలించేందుకు రిషికేష్ ఎయిమ్స్ నుంచి బయల్దేరిన ‘ఎయిర్ అంబులెన్స్’ అనూహ్యంగా క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. శనివారం 11.30 గంటలకు కేదార్నాథ్ ధామ్ కు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఎయిర్ అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న ఓ డాక్టర్, ఓ నర్స్ సహా మొత్తం ముగ్గురు వ్యక్తులు ప్రమాద ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ఘటనలో ఎయిర్ అంబులెన్స్ తోక భాగం మొత్తం దెబ్బతిన్నది. తాజా ఘటనపై రుద్రప్రయాగ్ జిల్లా టూరిజం నోడల్ ఆఫీసర్ రాహుల్ చౌబే మాట్లాడుతూ, ‘సాంకేతిక లోపం తలెత్తి..ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరపాల్సి వచ్చింది. ఈ క్రమంలో హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది’ అని వివరించారు. ఘటనపై డీజీసీఏ దర్యాప్తు చేపడుతుందని చెప్పారు.