న్యూఢిల్లీ, ఆగస్టు 31: ఐఏఎఫ్‌కు చెందిన ఎంఐ-17 చాపర్ ద్వారా కేదార్నాథ్ నుంచి గౌచర్‌కు తరలిస్తున్న సాంకేతికపర లోపాలున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయింది. లించోలీలోని మందాకిని నది సమీపంలో శనివారం ఈ హెలికాప్టర్ కూలిందని, ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.
మరమ్మతు కోసం హెలికాప్టర్‌ను గౌచర్ ఎయిర్‌స్ట్రిప్‌కు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకొన్నదని రుద్రప్రయాగ్ జిల్లా పర్యాటక శాఖ అధికారి రాహుల్ చౌబే తెలిపారు. ఈ హెలికాప్టర్‌ను తీసుకెళ్తున్న క్రమంలో ప్రారంభ సమయంలోనే బరువు, గాలి కారణంగా ఎంఐ-17 హెలికాప్టర్ బ్యాలెన్స్ తప్పిందని, దీంతో పైలట్ ఆ చాపర్‌ను ఒక ఖాళీ ప్రాంతంలో వదిలేశాడని వివరించారు.
కూలిన హెలికాప్టర్లో ప్రయాణికులు ఎవరూ లేరని, కూలిన తర్వాత ఘటనాస్థలికి రెస్క్యూ సిబ్బంది వెళ్లారని తెలిపారు. యాత్రికులను కేదార్నాథ్ ఆలయం వద్దకు తీసుకెల్లే ఈ ప్రైవేటు హెలికాప్టర్ సాంకేతిక లోపాలతో మే నెలలో కేదార్నాథ్ సమీపంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది.