శాస్త్రవేత్తల కఠోర శ్రమ ఫలితం చంద్రయాన్. దానిని తన ప్రచారానికి విస్తృతంగా వాడుకున్నది కేంద్రం. లోక్‌సభలో గురువారం చంద్రయాన్-3పై చర్చ కూడా జరిపింది. ఎంతసేపూ ఆ ఘనత అంతా తనదే అన్నట్టుగా డబ్బాకొట్టుకున్న మోదీ ప్రభుత్వం.. ఉద్యోగులను మాత్రం పస్తులే ఉంచింది. 18 నెలలుగా జీతాలివ్వలేదు. లాంచింగ్ప్యాడ్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన హెచ్ఈసీ సిబ్బంది.. గురువారం ఢిల్లీలో నిరసనకు దిగారు.
Chandrayaan | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశ పతాకాన్ని రెపరెపలాడించిన ఉద్యోగులు 18 నెలల నుంచి జీతాలు లేకుండా బతుకుతున్నారు. ఇటీవల చంద్రుడిపై ప్రయోగాలకు ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇది పచ్చి నిజం. తమ జీతాలు ఇవ్వాలంటూ ఎన్నిసార్లు అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో దేశ రాజధాని ఢిల్లీ గడ్డపై నిరసన గళం వినిపించారు. జార్ఖండ్ రాజధాని రాంచీ కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ (హెచ్ఈసీ) ఉద్యోగులు, ఇంజినీర్లకు గత 18 నెలల నుంచి జీతాలు లేవు. చంద్రయాన్-3 సెకండ్ లాంచిగ్ ప్యాడ్‌కు కావాల్సిన పరికరాలను హెచ్ఈసీ ఉద్యోగులే తయారు చేశారు.
జీతాలు రాకపోయినా దేశం కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారు. వీరి కష్టం ఫలించింది. చంద్రయాన్-3 విజయవంతమైంది. దీంతో ఇక తమ కష్టాలు తీరుతాయని హెచ్ఈసీ ఉద్యోగులు, ఇంజినీర్లు భావించారు. కానీ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. 18 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడంతో ఇక ఢిల్లీలో తేల్చుకుందామని బయలుదేరారు. గురువారం జంతర్‌మంతర్ రోడ్డులో ఆందోళన చేపట్టారు. చంద్రయాన్-3ని పోలిన కటౌట్లతో నిరసనకు దిగారు. ‘జీతాలు చెల్లించండి.. మా కుటుంబాలు రోడ్డున పడకుండా చూడండి’ అంటూ నినాదాలు చేశారు.