ముంబై: ముంబైలో ఇవాళ భారీ వర్షం(Mumbai Rains) పడే అవకాశం ఉన్నది. భారతీయ వాతావరణ శాఖ ఇవాళ హెచ్చరిక జారీ చేసింది. ముంబై, థానే, రాయ్గడ్, పుణె, సతారా జిల్లాలో ఇవాళ ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉన్నది. సిటీలో జూలై 27వ తేదీ ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తన హెచ్చరికలో వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో ముంబై తీరం వెంట సుమారు 50 కిలోమీటర్ల వేగంతో గాలి వీయనున్నది. ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లోనే వర్ష బీభత్సం కొనసాగనున్నది.
ప్రజలు ఎవరూ బయట తిరగవద్దు అని ఐఎండీ పేర్కొన్నది. ముంబైకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సమీప జిల్లాలకు కూడా ఈ అలర్ట్ ఇచ్చారు. ఆదివారం ఉదయం వరకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగనున్నది. రాయ్గడ్ జిల్లాకు మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేశారు. శనివారం ఉదయం వరకు మాత్రం పాల్గర్ జిల్లాకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద అలలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వర్షం వల్ల ఈస్ట్రన్ ఎక్స్ప్రెస్ వే జామైంది. రోడ్డు మొత్తం వాహనాలతో నిండిపోయింది. నిలిచిపోయిన వర్షపు నీటిని తొలగించేందుకు బీఎంసీ వర్కర్లు రంగంలోకి దిగారు.