Snowfall | దేశంలోని మూడు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తున్నది. జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మంచు తీవ్రంగా ఉన్నది. హిమాచల్ ప్రదేశ్‌లోని 7 జిల్లాలు చలిగాలుల గుప్పిట్లో ఉన్నాయి. విపరీతమైన హిమపాతం కారణంగా 3 వ నంబర్ జాతీయ రహదారితోపాటు దాదాపు 380 రోడ్లను అధికారులు మూసివేశారు. ఈ నెలాఖరు వరకు జమ్ముకశ్మీర్‌లో మంచు కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
లాహౌల్ స్పితి జిల్లాలో మంచు ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఇక్కడ 182 రోడ్లు మూసివేశారు. సిమ్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. జమ్ముకశ్మీర్‌లో మంచు కురుస్తుండటంతో శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. జనవరి 30 వరకు ఇక్కడ మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని చమోలిలో మంచు కురుస్తుండటంతో చాలా రోడ్లను మూసివేశారు. ఉత్తరకాశీలోని గంగోత్రి ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి పోయింది.
మధ్యప్రదేశ్‌లో చలి తీవ్రత నుంచి కొంత ఉపశమనం ఉన్నది. చాలా నగరాల్లో రాత్రి ఉష్ణోగ్రత 8 డిగ్రీలు దాటింది. పగటి ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నది. శుక్రవారం రాత్రి సాత్నాలో చిరుజల్లులు కురిశాయి. ఈ రోజు కూడా చలి నుంచి ఉపశమనం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తున్నది. అయితే ఆదివారం నుంచి 3 రోజుల పాటు గ్వాలియర్-చంబల్, బుందేల్‌ఖండ్‌లోని 15 జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. భోపాల్‌లో కూడా మేఘావృతమై ఉంటుంది.