న్యూఢిల్లీ: ఉత్తరాదిన పలు రాష్ర్టాల్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో ఉత్తర ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్..తదితర రాష్ర్టాల్లో జన జీవనం స్తంభించిపోయింది. శనివారం దక్షిణ గుజరాత్లో రికార్డ్‌స్థాయిలో వర్షపాతం నమోదైంది. వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. మహారాష్ట్రలోని ఇర్షాల్వాడీపై కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య 26కు చేరుకుంది. శిథిలాల కింద దాదాపు 83 మంది ఉండొచ్చని వార్తలు వెలువడుతున్నాయి. థానె జిల్లాలో ముగ్గురు చనిపోయారు.
శనివారం ఢిల్లీలో యమునా నది ప్రవాహం 205.33 మీటర్లకు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ బిజ్నోర్‌లో ఓ బస్సు కొత్వాలి నది వరదలో చిక్కుకుపోయింది. ఈ బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. కాగా, హిమాచల్, ఉత్తరాఖండ్‌లో జూలై 25 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది.