న్యూఢిల్లీ, జూలై 12: పలు రాష్ర్టాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుజరాత్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్నది. దక్షిణ జిల్లాలతో పాటు కచ్, రాజ్‌కోట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 8 మంది మరణించారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 27,896 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సూరత్, వల్సాద్‌తో సహా 13 జిల్లాలకు బుధవారం వరకు రెడ్ అలర్ట్ జారీచేశారు. వడోదర డివిజన్లో పలు రైళ్లు రద్దయ్యాయి. మహారాష్ట్రలో ముగ్గురు మరణించారు. ముంబై నగరంలో మంగళవారం కుంభవృష్టి వర్షం కురిసింది. నాసిక్, పాల్ఘర్, పుణె జిల్లాలకు మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 13 ఎన్డీఆర్ఎఫ్, 3 ఎస్టీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ దెబ్బతిన్నది. ఉత్తర కర్ణాటక జిల్లాలోని మర్కావాడా గ్రామంలో గోడకూలి 35 ఏండ్ల తల్లీ, 13 ఏండ్ల కుమార్తె మరణించారు. కొడగు జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు జరిగాయి. కేరళలోని కన్నూర్‌లో వరదలో కొట్టుకుపోతున్న ఓ జీపును బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంకా ఢిల్లీ, ఉత్తరాఖండ్, తదితర రాష్ర్టాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి.