న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఢిల్లీలో కుంభవృష్టి కురిసింది. నగర వీధులు వాగుల్లా మారిపోయాయి. గంటలకొద్దీ ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు కష్టాలుపడ్డారు. 24 గంటల్లో 112.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 19 ఏండ్లలో సెప్టెంబరు నెలలో ఒక్క రోజులో ఇంత వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి. 2002 సెప్టెంబరు 13న 126.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 1963 సెప్టెంబరు 16న కురిసిన 172.6 మిల్లీమీటర్ల వర్షమే ఆల్-టైమ్ రికార్డు.
ఈ నెలలో వర్షాలు ఎక్కువే: ఐఎండీ
దేశవ్యాప్తంగా ఈ నెలలో వర్షపాతం సాధారణం కంటే అధికంగా నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఆగస్టులో 24 శాతం తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఆ లోటు ఈ నెలలో వర్షాలతో కొంత భర్తీ అవుతుందని తెలిపింది.