న్యూఢిల్లీ : వేళాపాళా లేని నిద్రతో గుండెకు ముప్పు అని తాజా అధ్యయనం హెచ్చరించింది. నచ్చిన సమయంలో రోజుకు 7-8 గంటలు నిద్రపోయినా ఫలితముండదని తెలిపింది. ప్రతి రోజూ నిద్రకు ఓ సమయాన్ని నిర్ణయించుకుని, ఆ సమయంలో నిద్రపోకపోతే, గుండెపోటు ముప్పు 26 శాతం మేరకు పెరుగుతుందని ఎపిడమాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది. క్రమబద్ధమైన నిద్ర, హృదయ సంబంధిత వ్యాధుల ముప్పు అనే అంశంపై ఈ అధ్యయనం జరిగింది. దీని ప్రకారం.. క్రమ పద్ధతి లేకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయంలో నిద్రపోవడం వల్ల శరీరంలోని అంతర్గత జీవ గడియారం దెబ్బతింటుంది. ఫలితంగా కడుపులో మంట, అధిక రక్తపోటు, గుండె, రక్తనాళాలకు ముప్పు వంటివాటికి దారి తీస్తుంది. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే, ఎంత సేపు నిద్రపోతున్నామనేది కాదు, ఎప్పుడు నిద్రపోతున్నామనేది ముఖ్యం.
క్రమరహిత నిద్ర వల్ల గుండెపోటు ముప్పు వస్తుందని ఈ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనంలో 40-79 సంవత్సరాల మధ్య వయస్కులు 72,000 మందికిపైగా పాల్గొన్నారు.
ప్రతి రోజూ నిలకడగా ఒకే సమయానికి నిద్రకు ఉపక్రమించడం వల్ల శరీర సమతుల్యత కొనసాగుతుంది. హృదయ సంబంధిత వ్యవస్థపై ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండెను కాపాడుకోవడం కోసం క్రమం తప్పకుండా ఒకే సమయంలో నిద్రకు ఉపక్రమించడం ఎంత ముఖ్యమో, మొత్తం నిద్రాసమయం కూడా అంతే ముఖ్యమైనదని నిపుణులు స్పష్టం చేశారు. ఈ అధ్యయనంలో వెల్లడైన మరొక ముఖ్యాంశం ఏమిటంటే, పని దినాల్లో నష్టపోయిన నిద్రను వారాంతాల్లో కలిపేసుకుందామనుకుంటే ప్రయోజనం ఉండదు. నిద్ర సమయాలను తరచూ మార్చడం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడం సాధ్యం కాదని ఈ అధ్యయనం తెలిపింది.