న్యూఢిల్లీ, జూలై 7: నీట్-యూజీ పరీక్షలో అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఈ అంశానికి సంబంధించి దాఖలైన మొత్తం 38 పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఒకేసారి విచారించనుంది. నీట్ విద్యార్థులందరికీ మళ్లీ పరీక్ష నిర్వహించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారనుంది. మళ్లీ పరీక్ష నిర్వహించడం వల్ల నిజాయితీగా పరీక్ష రాసిన విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని జాతీయ పరీక్ష సంస్థ(ఎన్టీఏ), కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకు తెలియజేశాయి.
ప్రజాదరణ కోసం పాకులాడొద్దు నేతలకు పోప్ ఫ్రాన్సిస్ సూచన
ట్రైస్టే (ఇటలీ): ప్రస్తుతం ప్రజాస్వామ్యం మంచి స్థితిలో లేదని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. నేతలు ప్రజాదరణ కోసం పాకులాడటాన్ని మానుకోవాలని, పటిష్టమైన సమాజాల నిర్మాణానికి, ఓటర్ల ఉదాసీనతను పరిష్కరించడానికి వారు కృషి చేయాలని ఆయన కోరారు. 87 ఏండ్ల పోప్ కేవలం రెండు నెలల్లోనే నాలుగోసారి ఇటలీని సందర్శించారు. ఈ సందర్భంగా ట్రైస్టేలో సామాజిక వ్యవహారాలపై ఆదివారం జరిగిన సమావేశంలో ప్రసంగించారు. చాలామంది ప్రజలు ప్రజాస్వామ్యం నుంచి తమను మినహాయించినట్టు భావిస్తుంటారని.. అలాగే సమాజంలో పేదలు, బలహీనులు తమను తాము రక్షించుకోవడానికి మిగిలిపోయారని.. వీటిని బట్టి నేటి ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఆరోగ్యకరంగా లేదనేది స్పష్టమవుతున్నదని అన్నారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం సిద్ధాంతాల లోపాలను నివారించాలని పోప్ రాజకీయ నాయకులకు సూచించారు.