Madhya Pradesh | తన కూతురి ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ తండ్రి తన ప్రాణాలను ఫణంగా పెట్టాడు. కూతురి వైద్యం కోసం తన రక్తాన్ని అమ్ముకున్నాడు. ఒకట్రెండు సార్లు కాదు.. ఎన్నో సార్లు రక్తాన్ని అమ్ముకున్న ఆ తండ్రి.. బలహీనపడిపోయాడు. చివరకు కుటుంబానికి పోషించే స్తోమత లేక ఆత్మహత్య చేసుకున్నాడు. నా వైద్యం కోసం నాన్న తన రక్తాన్ని అమ్ముకున్నాడని ఓ కూతురు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్లోని సత్నాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సత్నాకు చెందిన అనుష్క గుప్తా(17) అనే యువతి ఐదేండ్ల క్రితం రోడ్డుప్రమాదానికి గురైంది. దీంతో ఆమె వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఇక ఆ యువతి మంచానికే పరిమితమైంది. కూతురి ప్రాణాలను కాపాడుకునేందుకు తండ్రి ప్రమోద్.. సొంతింటిని, దుకాణాన్ని అమ్ముకున్నాడు. అయినప్పటికీ ఆమె కోలుకోలేదు. ఇల్లు గడవడం, తిండి దొరకడం కష్టమైపోయింది. గ్యాస్ సిలిండ్, ఆహారం కోసం ప్రమోద్ తన రక్తాన్ని అమ్ముకున్నాడు. అంతే కాదు.. కూతురు ఆరోగ్యానికి సంబంధించిన నిత్యావసరాల కోసం కూడా ప్రమోద్ తన రక్తాన్ని అమ్మి, ఆమెకు కావాల్సిన వాంటన్నింటిని సమకూర్చాడు. ఈ క్రమంలో ప్రమోద్ బలహీనపడిపోయాడు. పని చేసే శక్తి లేకుండా పోయింది. కుటుంబ పోషణ భారంగా మారడంతో.. దిక్కుతోచని స్థితిలో ప్రమోద్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.