కర్నాటకలోని మాండ్యలో గణేష్ చతుర్ధి సందర్భంగా జరిగిన ఊరేగింపుపై రాళ్ల దాడి కలకలం రేపింది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి, కర్నాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి గురువారం స్పందించారు. మాండ్యలో ప్రస్తుతం పరిస్ధితి అదుపులో ఉందని, అయితే ఇప్పటికే అల్లరి మూకల దాడిలో విధ్వంసం జరిగిందని అన్నారు. తాను శుక్రవారం ఘటనా స్ధలాన్ని సందర్శిస్తానని చెప్పారు. ఈ ఘటనపై తాను ఇప్పటికే సమాచారం సేకరించానని తెలిపారు. గణేష్ ఊరేగింపును భగ్నం చేయాలని కొందరు దుండగులు ప్రయత్నించారని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సరైన రీతిలో స్పందించలేదని ఆరోపించారు. కర్నాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన అనంతరం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఓ వర్గం ప్రజల కోసమే పనిచేస్తున్నామనే సంకేతాలు పంపాలని కాంగ్రెస్ పాలకులు కోరుకుంటున్నారని ఆరోపించారు. అందుకే కర్నాటకలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు.
కర్నాటక శాంతియుత రాష్ట్రమని, కన్నడిగులు ఇలాంటి మత ఘర్షణలకు మద్దతు ఇవ్వరని స్పష్టం చేశారు. ప్రభుత్వ అసమర్ధత వల్లే ఇలాంటి ఘర్షణలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుజ్జగింపు రాజకీయాలు మంచిదికాదని సిద్ధరామయ్య సర్కార్కు హితవు పలికారు. తాను కూడా రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించానని, తాను అన్ని వర్గాలకు భద్రత కల్పించానని గుర్తుచేశారు. సమాజంలో ప్రతిఒక్కరి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ప్రభుత్వం అందరికీ సరైన ప్రాధాన్యత ఇవ్వడం కీలకమని హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు.
Read More :
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీ ఎంట్రీ.. ఇంతకీ ఎన్ని భాషల్లోనంటే..?