న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట బీజేపీ శ్రేణుల హింసాత్మక నిరసనలు, కేజ్రీవాల్ నివాసంపై దాడి ఘటనలపై ఢిల్లీ పోలీసుల స్పందనను ఢిల్లీ హైకోర్టు కోరింది. ఈ ఉదంతంపై రెండు వారాల్లోగా సీల్డ్ కవర్లో తాజా పరిస్ధితిపై నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని కోర్టు ఢిల్లీ పోలీసులను కోరింది.
ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని కోరుతూ ప్రధాని భద్రతా వైఫల్యంపై సర్వోన్నత న్యాయస్ధానం జారీ చేసిన ఉత్తర్వులను ఆప్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ప్రస్తావించారు. ఈ ఘటనపై కూడా అదే తరహా సిట్‌తో దర్యాప్తు చేయించాలని తాము కోరుతున్నామని కోర్టుకు నివేదించారు. భద్రతా ముప్పుపై తగిన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమని ప్రభుత్వ న్యాయవాది ఏఎస్జీ సంజయ్ జైన్ పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు.
కశ్మీర్ ఫైల్స్ మూవీలో చూపిన కశ్మీర్ పండిట్ల ఊచకోత వాస్తవం కాదని, ఈ సినిమాను యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తే అందరూ ఉచితంగా చూస్తారని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ఇంటి వద్ద బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య నేతృత్వంలో ఆ పార్టీ యువమోర్చా కార్యకర్తలు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. నిరసన హింసాత్మకంగా మారడంతో కేజ్రీవాల్ ఇంటి కిటికీలను బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటనను ఆప్ నేతలు తీవ్రంగా ఖండించారు. దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ ఈ రకంగా హింసకు తెగబడితే ఆ పార్టీ యువతకు ఏం సందేశం పంపుతోందని కాషాయ పార్టీ గూండాగిరిని కేజ్రీవాల్ ఖండించారు.