Cough Syrup | మధ్యప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో దగ్గుమందు కారణంగా దాదాపు 14 మంది చిన్నారులు చనిపోయారు. ఈ ఘటన యావత్ భారతదేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారుల మృతి నేపథ్యంలో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ అమ్మకాలను నిషేధించారు. అయితే, నాగ్‌పూర్‌లోని కలర్స్ హాస్పిటల్ డైరెక్టర్ రితేష్ అగర్వాల్ చింద్వారాలో దగ్గు సిరప్ సేవించిన పిల్లల్లో మూత్రపిండాల సమస్యలకు మూలకారణం గుర్తించలేదని స్పష్టం చేశారు. నాగ్‌పూర్‌కు రెఫర్ చేసిన కొంతమంది పిల్లల గురించి, ఆసుపత్రిలో చేరిన పిల్లల పరిస్థితి విషమంగా ఉందని, వారిలో తీవ్రమైన మూత్రపిండాల సమస్యలు తలెత్తాయని అగర్వాల్ తెలిపారు. జ్వరం, మూత్ర విసర్జన చేయలేకపోవడం, వాపు, క్రియాటినిన్ లెవల్స్ పెరిగినట్లు తేలింది. సిరప్ తాగిన పిల్లల్లో పలువురు అస్వస్థతకు గురవగా కొందరిని చింద్వారా, నాగ్‌పూర్‌లోని ఆసుపత్రులలో చేర్పించారు. కొందరు ఇప్పటికీ డయాలసిస్‌తో సహా చికిత్స పొందుతున్నారు.
డాక్టర్ రితేష్ అగర్వాల్ మాట్లాడుతూ ‘మా వద్దకు చింద్వారా నుంచి పలువురు పిల్లలను తీసుకువచ్చారు. ఇందులో ఓ పిల్లవాడికి రెండు మూడురోజుల కిందట జ్వరం వచ్చింది. ఆ తర్వాత 24గంటలు మూత్ర విసర్జన చేయలేకపోయాడు. తొలుత పిల్లవాడిని చింద్వారా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ప్రథమ చికిత్స తర్వాత కూడా పిల్లవాడు మూత్రవిసర్జన చేయలేదు. అక్కడి వైద్యులు పిల్లవాడి కిడ్నీల్లో వాపు ఉన్నట్లుగా గుర్తించారు. పిల్లవాడిని నాగ్‌పూర్‌కు రెఫర్ చేశారు. బాలుడిని విషమ పరిస్థితుల్లోనే ఇక్కడికి తీసుకువచ్చారు. మేం ఇక్కడ రక్త పరీక్షలు చేశాం. క్రియాటినిన్, యూరియా స్థాయిలు గణనీయంగా పెరిగాయని గుర్తించారు. ఆ సమయంలో మూత్రపిండాలు పని చేస్తున్నాయా? లేదా? అని తెలుసుకునేందుకు అనేక పరీక్షలు చేశాం.
టెస్టుల్లో కిడ్నీలు సరిగా పని చేయడం లేదని తెలిసింది. పిల్లవాడి కిడ్నీ సమస్యలకు పూర్తి కారణాలు తెలియదు. అయితే, డయాలసిస్ తర్వాత పిల్లవాడు కోలుకున్నాడు. ప్రస్తుతం మూత్రపిండాలు సాధారణంగా పనిచేస్తున్నాయి’ అని డాక్టర్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ పరిస్థితి కారణాలు ఏదైనా వింత వ్యాది కావొచ్చని.. మందులు, రసాయనాల వల్ల వచ్చిందో తెలియదన్నారు. పిల్లవాడు మాత్రం పురుగుమందులు ఎక్కువగా ఉపయోగించే వ్యవసాయ ప్రాంతం నుండి వచ్చాడని.. ఈ పరిస్థితి నుంచి కోలుకునేందుకు పిల్లవాడికి డయాలసిస్ చేయించామన్నారు. ఐదారు రోజులు డయాలసిస్ అవసరం లేదని.. పిల్లవాడి క్రియాటినిన్ లెవల్స్ సాధారణమైందని తెలిపారు. బాలుడు మూత్ర విసర్జన సైతం సాధారణంగానే ఉందని.. అయితే, సమస్యకు ప్రధాన కారణాన్ని గుర్తించలేకపోయామన్నారు.