లక్నో: ఉత్తరప్రదేశ్‌ను అవమానించే బాధ్యత కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తీసుకున్నాయా? అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. లక్నోలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ, పంజాబ్ సీఎం యూపీ ప్రజలను అవమానించగా ప్రియాంక గాంధీ నవ్వారని ఆయన విమర్శించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ యూపీ ప్రజలను గుండాలుగా అభివర్ణించగా, అఖిలేష్ యాదవ్ ఆమెకు పెద్ద పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారని దుయ్యబట్టారు. యూపీని అవమానించే బాధ్యత కాంగ్రెస్, ఎస్పీ తీసుకున్నాయా అని ప్రశ్నించారు.
కాగా, కేంద్ర సహాయ మంత్రి, కర్హాల్ బీజేపీ అభ్యర్థి ఎస్సీ సింగ్ బఘేల్‌పై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) గుండాలు ఈ నెల 14న మెయిన్‌పురిలో దాడి చేయడాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఖండించారు. మెయిన్‌పురిలో జరిగే ప్రతి ఎన్నికలప్పుడు ఎస్పీ గూండాలు ఇలాగే చేస్తారని విమర్శించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి పోలింగ్ బూత్‌లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, పోలింగ్‌కు ఒక రోజు ముందు ఫ్లాగ్‌మార్చ్‌లు, పారామిలటరీ బలగాలను మోహరించాలని ఈసీని కోరినట్లు చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో తొలి, రెండో దశ పోలింగ్ తర్వాత అఖిలేష్‌కు చెమటలు పట్టాయని అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. అందుకే పార్టీ కార్యకర్తలు, గూండాలను హింసకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఫిబ్రవరి 14న బీజేపీ ఎంపీ, యూపీ మహిళా మోర్చా చీఫ్ గీతా శాక్యపై దాడి చేశారని దుయ్యబట్టారు. మహిళలపై కూడా సమాజ్‌వాదీ పార్టీ హింసకు పాల్పడుతున్నదని ఆరోపించారు. అందుకే తాను లక్నో వచ్చి ఈసీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.