M K Stalin | నాగపట్టణం(తమిళనాడు), మార్చి 3: పెళ్లి చేసుకుని వెంటనే పిల్లల్ని కనాలని యువతకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. ఎక్కువ మంది ఎంపీలు కావాలంటే ఎక్కువ జనాభా ఉండడమే ప్రధాన అర్హతగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం నాడిక్కడ ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన స్టాలిన్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ పాత రోజుల్లో పెళ్లయిన వెంటనే పిల్లల్ని కనవద్దని యువ జంటలకు సలహా ఇచ్చేవారని, అయితే ఇప్పుడు అదే సలహా ఇవ్వలేమని, ఇప్పుడు ఆ అవసరం కూడా లేదని ఆయన చెప్పారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్నందున ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని స్టాలిన్ అన్నారు.
జనాభా నియంత్రణపై తమిళనాడు దృష్టి పెట్టి విజయం సాధించిందని, ఇప్పుడు రాష్ర్టానికి ఈ దుస్థితి రావడానికి అదే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల పునర్విభజన సమస్య తమిళనాడు హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించిందని, దీన్ని కేవలం రాజకీయ సమస్యగా మాత్రమే పరిగణించలేమని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మార్చి 5న చెన్నైలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. గుర్తింపు పొందిన 40 పార్టీలలో అధిక పార్టీలు సమావేశానికి రావడానికి అంగీకారం తెలియజేశాయని చెప్పారు.