Prajwal Revanna | బెంగళూరు, జూన్ 2: లైంగిక దాడి ఆరోపణల కేసులో అరెస్టయిన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తనను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి సహకరించడం లేదని తెలిసింది. గత రెండు రోజులుగా సిట్ అధికారులకు ప్రజ్వల్ నుంచి పూర్తి సహాయ నిరాకరణ ఎదురవుతున్నది. ‘నాకేం తెలీదు.. నేను నిర్దోషిని.. నన్ను కుట్ర చేసి ఈ కేసులో ఇరికించారు’ అన్న సమాధానమే ఆయన నుంచి వస్తున్నట్టు తెలిసింది. దీంతో ఆయన్ను స్పాట్ విచారణ జరపాలని సిట్ యోచిస్తున్నది.
లోక్‌సభ ఎన్నికల లెక్కింపు ప్రారంభమయ్యే మంగళవారానికి ముందే దీనిని పూర్తి చేయాలని యోచిస్తున్నది. మరోవైపు సెక్స్ వీడియోలు తీశారని భావిస్తున్న ప్రజ్వల్ యాపిల్ ఫోన్లోని డాటాను యాక్సిస్ చేయడానికి సిట్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఐ క్లౌడ్‌లో నిక్షిప్తమైన ఆ డాటాను యాక్సిస్ చేస్తే, అసభ్య వీడియోలు ఆయన ఫోన్ నుంచి తీసారా లేదా అన్న విషయం నిర్ధారణ అవుతుందని సిట్ భావిస్తుంది.
ఇదే కేసులో విచారణకు గైర్హాజరైన ప్రజ్వల్ తల్లి భవాని ముందస్తు బెయిల్ కోసం సోమవారం హైకోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తున్నది. కాగా.. ప్రజ్వల్ తండ్రి హెచ్డీ రేవణ్ణ ఇప్పటికే కిడ్నాప్ కేసులో అరెస్టయ్యి బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే ఆయన బెయిల్‌ను రద్దు చేయాలంటూ సిట్ హైకోర్టును ఆశ్రయించడంతో అదివారం లేదా సోమవారం ఈ అంశం విచారణకు వచ్చే అవకాశం ఉంది.