చండీఘఢ్ : మహిళా అథ్లెటిక్స్ కోచ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై హర్యానా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్‌పై కేసు నమోదైంది. సందీప్ సింగ్ జాతీయ హాకీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్నారు. కురుక్షేత్రలోని పెహోవా బీజేపీ ఎమ్మెల్యే అయిన సింగ్ తనను తొలుత జిమ్‌లో చూశారని ఆపై ఇన్‌స్టాగ్రాంలో పరిచయం పెంచుకున్నాడని మహిళా అథ్లెటిక్ కోచ్ పేర్కొన్నారు.
ఇన్‌స్టాలో తనతో పరిచయం పెంచుకున్న మంత్రి ఆపై తనను కలుసుకోవాలని ఒత్తిడి చేశాడని ఆరోపించారు. తన నేషనల్ గేమ్స్ సర్టిఫికెట్ పెండింగ్‌లో ఉందని, ఈ విషయమై తనను కలవాలని కోరాడని చెప్పారు. దురదృష్టవశాత్తూ ఫెడరేషన్లో తన సర్టిఫికెట్ గల్లంతు కాగా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లానని బాధిత మహిళ తెలిపారు.
చివరకు తాను మంత్రి వద్దకు డాక్యుమెంట్లతో వెళ్లానని, ఈ క్రమంలో సందీప్ సింగ్ తన పట్ల అభ్యంతరకరంగా వ్యవహరిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. కాగా అథ్లెటిక్ కోచ్ తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని మంత్రి తోసిపుచ్చారు. మంత్రిపై ఆరోపణలు రావడంతో ఈ అంశంపై దర్యాప్తు చేపట్టేందుకు హర్యానా ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేసింది.