గురుగ్రామ్ : హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూశారు. మాజీ ఉప ప్రధాని దేవీలాల్ కుమారుడైన 89 ఏండ్ల చౌతాలాకు శుక్రవారం గుండెపోటు రావడంతో వెంటనే దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఆయన గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు. 1989 నుంచి 2005 వరకు ఐదుసార్లు ఆయన హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. ఆయన భార్య స్నేహలత ఐదేండ్ల క్రితమే మరణించారు. చౌతాలా మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.