చండీఘడ్ : హరియాణలో (Haryana Violence) మత ఘర్షణల నేపధ్యంలో హింసాకాండకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపడతామని, దోషులను ఉపేక్షించేది లేదని సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. హింసకు పాల్పడిన 116 మందిని అరెస్ట్ చేశామని, 90 మందిని నిర్భందంలోకి తీసుకున్నామని చెప్పారు. అల్లర్లతో అట్టుడికిన నుహ్‌లో స్పెషల్ బెటాలియన్‌ను రంగంలోకి దింపామని చెప్పారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు.
సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించామని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు. బజరంగ్ దళ్ నేత మోను మనేసర్ ఎక్కడున్నారనే వివరాలు వెల్లడి కాలేదని అన్నారు. అల్లర్లలో మోను మనేసర్ ప్రమేయం ఉంటే ఆ దిశగా విచారణ సాగుతుందని చెప్పారు. కాగా, హరియాణ అల్లర్లలో ఇమాం సహా ఇద్దరు హోంగార్డులు, ఇద్దరు పౌరులు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గురుగ్రాంలో మంగళవారం రాత్రి అల్లర్లు చెలరేగడంతో ఢిల్లీ సహా జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) అప్రమత్తమైంది.
గురుగ్రాంలోని సోహ్న సబ్‌డివిజన్‌లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్ధలకు బుధవారం సెలవు ప్రకటించారు. అలజడి నెలకొనకుండా భారీ సంఖ్యలో ఆయా ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు. నుహ్ ఘర్షణలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని నిర్మాణ్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద నిరసనలకు వీహెచ్‌పీ పిలుపు ఇవ్వడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. హరియాణ హింసాకాండకు వ్యతిరేకంగా మనేసర్‌లోని బిసం దాస్ మందిర్‌లో బుధవారం సాయంత్రం మహాపంచాయత్‌కు వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ పిలుపు ఇచ్చాయి. నోయిడాలో భారీ ప్రదర్శన చేపట్టేందుకు హిందూ సంస్ధలు సన్నద్ధమయ్యాయి, నోయిడా స్టేడియం నుంచి ప్రారంభమయ్యే నిరసన ప్రదర్శన రజనిగంధ చౌక్ వద్ద ముగుస్తుందని వీహెచ్‌పీ ప్రచార కమిటీ చీఫ్ రాహుల్ దూబే వెల్లడించారు.
Read More :
Hyderabad | హబ్సిగూడలో దట్టంగా వ్యాపిస్తున్న పొగలు.. భయాందోళనలో స్థానికులు