Haryana CM : హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ను కలిశారు. బుధవారం ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో వీరి భేటీ జరిగింది. అమిత్ షా నివాసానికి చేరుకోగానే సైనీ ఆయనకు పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి కాంస్య విగ్రహాన్ని బహూకరించారు. ఆ తర్వాత షాకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా హర్యానాలో బీజేపీని గెలిపించిన నాయబ్‌సింగ్ సైనీకి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. మిఠాయిలు తినిపించారు.
కాగా, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయం సాధించింది. హర్యానా ప్రజలు వరుసగా మూడోసారి బీజేపీకే పట్టంకట్టారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 200 రోజుల ముందు హర్యానా సీఎంగా పగ్గాలు చేపట్టిన సైనీ.. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. దాంతో బీజేపీ అధిష్ఠానం మళ్లీ సైనీకే సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీఎం రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ హైకమాండ్ మాత్రం సైనీ వైపే క్లారిటీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో నాయబ్ సింగ్ సైనీ హోంమంత్రి అమిత్ షాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమిత్ షానే సైనీని ఢిల్లీకి పిలిపించుకున్నారా..? లేదంటే సైనీనే స్వయంగా వెళ్లి ఆయనను కలిశారా..? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే పై రెండింటిలో ఏది జరిగినా సైనీకే సీఎం పగ్గాలు అనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. కాగా 10 ఏండ్లుగా హర్యానా సీఎంగా కొనసాగిన మనోహర్‌లాల్ ఖట్టర్‌ను తీరా అసెంబ్లీ ఎన్నికల ముందు పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత లోకసభకు పంపారు.