అంబాల: వచ్చే నెల 5న హర్యానాకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అధికార బీజేపీకి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ విజ్ షాకిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ కనుక తిరిగి అధికారంలోకి వస్తే, సీఎం పదవి తనకే ఇవ్వాలన్నారు. అయితే హర్యానాలో గెలిస్తే నాయబ్ సింగ్ సైనీయే తిరిగి సీఎం అవుతారని ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది.
ఈ క్రమంలో అనిల్ విజ్ ఆదివారం మాట్లాడుతూ ‘ఇప్పటివరకు నేను అధిష్ఠానాన్ని ఏమీ అడగ లేదు. అంబాల, రాష్ట్ర ప్రజలు నా దగ్గరకొచ్చి ఇంత సీనియర్ అయి ఉండి మీరెందుకు సీఎం కాలేదని అడుగుతున్నారు. ప్రజల డిమాండ్, నా సీనియారిటీ ఆధారంగా ఈసారి నేనే సీఎంని అవుతా’ అని అన్నారు. తనను సీఎంగా చేయడం పార్టీ ఇష్టమని.. ఒక వేళ సీఎంను చేస్తే హర్యానా తలరాత, ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తానని అన్నారు.
హర్యానాలో బీజేపీ విజయం సాధిస్తే ప్రస్తుత సీఎం నాయబ్ సింగ్ సైనీయే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని హర్యానా పార్టీ ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. అనిల్ విజ్ ప్రకటనను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక పార్టీ నేతగా ఆయన అలా మాట్లాడి ఉండవచ్చన్నారు.