మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 05, 2020 , 21:29:41

ప్రైవేట్‌ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్‌

ప్రైవేట్‌ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్‌

చండీగఢ్‌: ప్రైవేట్‌ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లును హర్యానా అసెంబ్లీ గురువారం ఆమోదించింది. డిప్యూటీ సీఎం, కార్మిక మంత్రి దుష్యంత్‌ చౌతాలా ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అయితే నెలకు రూ.50 వేల కంటే తక్కువ వేతనం ఉన్న పోస్టులకే ఇది వర్తిస్తుంది. ఒకవేళ ఆ పోస్టునకు సరైన స్థానిక అభ్యర్థి లభించని పక్షంలో ప్రభుత్వానికి ఆ సమాచారాన్ని తెలియజేసి స్థానికేతరులను నియమించుకోవచ్చన్న మినహాయింపు ఉన్నది. మరోవైపు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 19 ప్రకారం చట్టం ముందు సమానత్వం, భారతదేశంలో ఎక్కడైనా ఏదైనా వృత్తిని నిర్వహించుకునే హక్కుకు ఈ బిల్లు వ్యతిరేకంగా ఉన్నది. దీంతో హర్యానా రాష్ట్ర స్థానిక అభ్యర్థుల ఉపాధి బిల్లు 2020కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఆమోదం తెలుపుతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే హర్యానాలోని ప్రైవేట్‌ సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆయా సంస్థలపై రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ప్రైవేట్‌ సంస్థల్లో స్థానికులకు ఉద్యోగ నియామకాలపై పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమిస్తారు. ధృవీకరణ పత్రాల ఆధారంగా అభ్యర్థి స్థానికతను నిర్ధారిస్తారు. 

గత ఏడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జేజేపీ అధినేత దుష్యంత్‌ చౌతాలా ఈ హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్‌, బీజేపీలో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో బీజేపీ, జేజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని దుష్యంత్‌ నెరవేర్చారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.