Haryana | న్యూఢిల్లీ: సాధారణంగా మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయి. కానీ హర్యానాకు చెందిన వ్యక్తికి చాలా అరుదుగా మూడోసారి కిడ్నీ ఆపరేషన్ చేయడంతో ఆయన శరీరంలో మొత్తం ఐదు కిడ్నీలు ఉన్నాయి. గత 15 ఏండ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న దేవందే బలేవర్(47)కు ఫరీదాబాద్‌లోని అమృత హాస్పిటల్లో మూడోసారి ఆపరేషన్ చేసి మరో కిడ్నీని అమర్చారు.
2010, 2012లలో కూడా ఆయనకు కిడ్నీ ఆపరేషన్లు చేసినా అవి ఫెయిలయ్యాయి. దీంతో అతని శరీరంలో నాలుగు పనిచేయని కిడ్నీలు ఉండగా, బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి కిడ్నీని నెల రోజుల క్రితం అమర్చారు. దీంతో ఆయన శరీరంలో నాలుగు పనిచేయని, ఒక పనిచేసే కిడ్నీ ఉన్నాయి. ఆపరేషన్ చేసిన 10 రోజులకే అతడిని డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బలేవర్ తన రోజువారీ కార్యకలాపాలు యథావిధిగా చేసుకుంటున్నారు.