న్యూఢిల్లీ : సురక్షితం లేదా ప్రకృతి సిద్ధం అంటూ నిత్యం ఆకట్టుకునే ప్రకటనలు గుప్పించే డజన్ల కొద్దీ టూత్‌పేస్ట్ బ్రాండులలో చాలా వరకు సీసం, ఆర్సెనిక్, పాదరసం, కాడ్మియంతోసహా ప్రమాదకర భార లోహాలు ఉన్నాయన్న వాస్తవం తాజా పరిశోధనలో బయటపడింది. లాడ్ సేఫ్ మామా సంస్థ 51 టూత్‌పేస్టు, టూత్ పౌడర్ ఉత్పత్తులను థర్డ్-పార్టీ ల్యాబ్ పరీక్షలు నిర్వహించగా దిగ్భ్రాంతికర ఫలితాలు వెల్లడయ్యాయి. 90 శాతం ఉత్పత్తులలో సీసం ఉన్నట్లు వెల్లడి కాగా దీర్ఘకాలం ఆరోగ్యంపై ప్రభావం చూపే హానికరమైన లోహమైన ఆర్సెనిక్ 65 శాతం ఉత్పత్తులలో ఉన్నట్లు తేలింది. అయితే, ఆరోగ్యానికి హాని చేసే వీటిపై ఎవరికీ ఆందోళన లేకపోవడం ఆశ్చర్యకరమని లీడ్ సేఫ్ మామా వ్యవస్థాపకురాలు తమారా రూబిన్ పేర్కొన్నారు. క్రెస్ట్, సెన్సోడైన్, కోల్గేట్, టామ్స్ ఆఫ్ మైనే తదితర బ్రాండ్లకు చెందిన పేస్టులు, పౌడర్లలో ఆందోళనకరమైన ఫలితాలు బయటపడ్డాయని ఆమె చెప్పారు.
పిల్లలు వాడే టూత్‌పేస్టు బ్రాండ్లలో సగం వరకు(47శాతం)పాదరసం ఉన్నట్లు పరీక్షలో తేలిందని రూబిన్ చెప్పారు. 35 శాతం పిల్లల బ్రాండ్లలో మరో ప్రమాదకర భార లోహం కాడ్మియం ఆనవాళ్లు కనిపించాయని తెలిపారు. కొద్దిపాటి సీసం కూడా తీవ్ర ఆరోగ్య సమస్యలను సృష్టించగలదని ఆమె చెప్పారు. సీసం వల్ల ఆరేండ్ల లోపు పిల్లలలో బాగు చేయలేనంత మానసిక, ఆరోగ్య సమస్యలు వస్తాయని, వాటి పరిమాణం పెరిగితే అది ప్రాణనష్టం కూడా చేకూర్చగలదని ఆమె ఆందోళన చెందారు.
ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షలలో అనేక ప్రముఖ బ్రాండ్లకు చెందిన టూత్‌పేస్టులు హానికరమని తేలింది. వీటిలో ఆర్గానిక్ లేదా డాక్టర్లచే సిఫార్సు చేయబడిన అంటూ ప్రకటనలు ఇచ్చేవి కూడా ఉండడం విశేషం. క్రెస్ట్, సెన్సోడైన్, టామ్స్ ఆఫ్ మైనే, కోల్గేట్, డాక్టర్ బ్రానర్స్ డేవిడ్స్, డాక్టర్ జెన్, డాక్టర్ బ్రైట్ మొదలైనవి ఈ హానికర బ్రాండ్ల జాబితాలో ఉన్నాయి.
టూత్‌పేస్టులను కొనేముందు దానిపైన ప్రకృతి సిద్ధమైన లేదాఫ్రోరైడ్ రహిత వంటి లేబుల్స్ ఉన్నవైతే అవి సురక్షితం అని పూర్తిగా భావించనవసరం లేదు. టూత్‌పేస్టులో ఉన్న పదార్థాలు ఏమిటో నిశితంగా చదవాల్సి ఉంటుంది.