ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, గాంధీ కుటుంబానికి అత్యంత వీర విధేయుడిగా ఉన్న హరీశ్ రావత్ బుధవారం ఒక్కసారిగా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే తనను ఈదమంటున్నారో… వారే తన కాళ్లు, చేతులు కట్టిపారేశారని అధిష్ఠానంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన విషయంలో పార్టీ తీవ్ర వివక్షతను చూపుతోందని మండిపడ్డారు. ”చూడండి.. ఎంత చిత్రమో.. ఎన్నికలన్న సముద్రంలో ఈదమన్నారు. ఈదడానికి తగిన మద్దతివ్వాల్సింది పోయి… వెన్నుపోటు పొడుస్తోంది సంస్థ. నాకు వ్యతిరేకంగా పాత్ర పోషించడానికి సిద్ధపడిపోయింది. ఈత కొట్టమని దించేశారు. దాంతో పాటు కొన్ని మొసళ్లను కూడా జారవిడిచారు. కాళ్లు, చేతులు కట్టేసి ఈత కొట్టమంటున్నారు. అలిసిపోయా.. ఇక చాలనిపిస్తోంది. విశ్రాంతి తీసుకోవాలనిపిస్తోంది. కొత్త సంవత్సరం ఓ దారిని చూపిస్తుందని ఆశాభావంతోనే ఉన్నా. కేదారేశ్వరుడు ఓ కొత్త మార్గాన్ని చూపిస్తాడని విశ్వాసంతోనే ఉన్నా” అంటూ హరీశ్ రావత్ ట్వీట్ చేశారు.
2014 నుంచి 17 వరకూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏకంగా ఐదు సార్లు ఎంపీగా ఎన్నికై, పార్లమెంట్‌కు వెళ్లారు. మన్మోహన్ సింగ్ హయాంలో జలవనరుల శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ముద్రపడ్డారు. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్దూ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తి, పంజాబ్‌లో పార్టీ పుట్టి మునుగుందన్న సమయంలో అక్కడి వెళ్లి, ఇరు నేతల మధ్య సయోధ్య కుదిర్చి, పంజాబ్ రాజకీయాలను గాడిలో పెట్టిన దిట్ట రావత్. అలాంటి రావత్ ఇప్పుడు ఉత్తరాఖండ్ రాజకీయాల్లో సంచలనం రేపారు.