ఇంధన ఉత్పత్తి, అన్వేషణ రంగాల్లో భారత్లో భారీ పెట్టుబడి అవకాశాలున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఈ రంగాల్లో 2030 నాటికి భారత్లో ఏకంగా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడికి అవకాశాలున్నాయని వెల్లడించారు. ఢిల్లీలోని భారత్ మంటపంలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
భారత్లో ఇంధన వనరుల అన్వేషణ, ఇంధన ఉత్పత్తిలో అవకాశాల గురించి ఈ వేదికపై చర్చ జరిగింది. భారత్లోని 26 అవక్షేప బేసిన్లలో ఇప్పటికీ ఇంధన వనరుల అన్వేషణ, వెలికితీతకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. మన వద్ద భూగర్భ వనరులు ఉన్నా గతంలో తగినంతగా ఈ రంగాల్లో పురోగతి చోటుచేసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భారత్లో కేవలం పది శాతం అవక్షేప బేసిన్స్లో ఇంధన వనరుల వెలికితీత జరుగుతున్నదని పేర్కొన్నారు. ఇది త్వరలో 16 శాతానికి పెరుగుతుందని మంత్రి వివరించారు. అంతర్జాతీయ సంక్షోభ సమయంలో భారత్ తన చమురు సరఫరాదారును మార్చని పక్షంలో భారత్లో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిఉండేవని తెలిపారు. ఇంధన అన్వేషణకు భారత్ శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటోందని, నూతన డేటాను సమీకరించేందుకు రూ. 7500 కోట్లు వెచ్చిస్తోందని పేర్కొన్నారు.
Read More :