UGC | న్యూఢిల్లీ : అనధికారిక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి, జూనియర్ విద్యార్థులను సీనియర్లు వేధించడం ర్యాగింగ్ నేరమని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. ఇటువంటి గ్రూపులను సీనియర్ విద్యార్థులు ఏర్పాటు చేశారేమో పరిశీలించాలని ఉన్నత విద్యా సంస్థలను కోరింది. యాంటీ ర్యాగింగ్ రూల్స్‌ను అమలు చేయాలని ఆదేశించింది.
వాట్సాప్ మెసేజ్‌లతో జూనియర్లను వేధించేవారిపై ఈ రూల్స్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. క్యాంపస్‌లో విద్యార్థుల భద్రత చాలా ముఖ్యమైనదని, ఈ విషయంలో ఎటువంటి రాజీ లేదని స్పష్టం చేసింది. యాంటీ ర్యాగింగ్ రూల్స్‌ను అమలు చేయడంలో విఫలమయ్యే విద్యా సంస్థలకు గ్రాంట్ల నిలిపివేత సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సీనియర్ల ఆదేశాలను పాటించని జూనియర్లను సాంఘికంగా బహిష్కరించడం, జుట్టు కత్తిరించుకోవాలని నిర్బంధించడం, సుదీర్ఘ సమయం మేలుకుని ఉండేలా చేయడం, మాటలతో అవమానించడం వంటి చర్యలకు పాల్పడటం యాంటీ ర్యాగింగ్ రెగ్యులేషన్స్‌ను ఉల్లంఘించడమేనని తెలిపింది.