బెంగళూరు, నవంబర్ 27: విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ‘హ్యాపీ క్యాంపస్’ పేరుతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ కొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది. విద్యార్థులకు సుదర్శన క్రియ, ధ్యానం, ప్రాణాయామం వంటివి నేర్పించి, వారిలో ఏకాగ్రతను, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 70 పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విద్యాసంస్థల్లో చదువుతున్న 1.78 లక్షల మంది విద్యార్థులకు మానసిక ఒత్తిడిని జయించేలా శిక్షణ ఇవ్వనుంది. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారని, ఆత్మన్యూనత, దూకుడు స్వభావంతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అన్నారు. ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.